సూర్యాపేట జిల్లా : శనివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసన ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొర్లి పోతున్నాయి. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ , ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలోని ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెం.మీ., నకిరేకల్ లో 11.7 సెం.మీ., మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కాప్రాలో 11.6 సెం.మీ., అయిటి పాముల ( నల్లగొండ )లో 11.5సెం.మీ., మేడ్చల్ మల్కాజ్ గిరి నాచారంలో 11.3 సెం.మీ., కట్టంగూర్ ( నల్లగొండ)లో 11.1 సెం.మీ., ఉప్పల్ చిలుకానగర్ లో 11.0 సెం.మీ., వర్షపాతం నమోదైంది.