పులిచర్మం విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్

పులిచర్మం విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్ములుగు జిల్లా : అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్ తన కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మంగళవారం కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు పులిచర్మం విక్రయించేందుకు ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి వస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. వెంకటాపురం సీఐ శివప్రసాద్, వాజేడు మండలం జగన్నాధపురం గ్రామం జాతీయ రహదారిపై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు రెండు బైకుల మీద ఛత్తీస్ గఢ్ నుంచి వస్తుండగా అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో వారి వద్ద ఒక సంచిలో పులి చర్మాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని పూనెం విగ్నేహి, చీర శీను, పోయెమ్ రమేష్, చింతల బాలకృష్ణ, పొది చంటిలను అరెస్ట్ చేశామన్నారు.

ఛత్తీస్ గఢ్ లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పులి చర్మాన్ని కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయించేందుకు వచ్చినట్లు నిందితులు తెల్పారని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్ ఓ ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.