త్వరలో వీ.సీ.ల నియామకం

త్వరలో వీ.సీ.ల నియామకంహైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్ లర్ (వీ.సీ) పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. టూరిజం ప్లాజాలో ఎక్సెల్ ఇండియా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ” హయ్యర్ ఎడ్యుకేషన్ – పోస్ట్ కొవిడ్ ఎరా ” అనే అంశంపై జరిగిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వీ.సీ.ల భర్తీ ప్రక్రియను నెల రోజుల కాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు వివిధ యూనివర్సిటీలలో 1061 టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ న్యాయపరమైన కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయని, అవసరమైతే చట్ట సవరణలు చేసి పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

వివిధ పోస్టుల భర్తీకి చేపట్టే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏకకాలంలో జరిపితే బాగుంటుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో చేపట్టిన రిక్రూట్మెంట్ విధానం అనుసరణీయమని ఆయన అన్నారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సాంకేతిక విద్య, కాలేజీయేట్ కమిషనర్ నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్స్ లర్ చిరంజీవులు, ఉన్నత విద్యామంలి వైస్ చైర్మన్లు ప్రొ.వెంకటరమణ, లింబాద్రి, టీ.సాట్ సీఈఓ శైలేష్ రెడ్డి, ద హిందూ డిప్యూటి ఎడిటర్ ఆర్. రవికాంత్ రెడ్డి, ఎక్సెల్ ఇండియా ఎడిటర్ ఎస్.రామక్రిష్ణ, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య చైర్మన్ డా.గౌతమరావు, ప్రొ.మనోజా, డా.రవికుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.