‘మన-ఊరు మన-బడి’తో స్కూళ్లకు మహర్దశ

‘మన-ఊరు మన-బడి’తో స్కూళ్లకు మహర్దశ

‘మన-ఊరు మన-బడి’తో స్కూళ్లకు మహర్దశవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో ‘మన బస్తీ-మన బడి‘ కార్యక్రమంలో భాగంగా పునః నిర్మాణం చేసిన పాఠశాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.

‘మన ఊరు-మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో 26,హనుమకొండ జిల్లాలో 28పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల భవనాలకు మరమ్మతులు, రంగులు, ప్రహరీలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నీచర్‌, డిజిటల్‌ తరగతులు, సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు, పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డులు, మేజర్‌, మైనర్‌ రిపేర్లు, కిచెన్‌షెడ్స్‌, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూళ్లల్లో డైనింగ్‌హాల్స్‌, విద్యుత్తు సౌకర్యం,ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టడం జరిగిందన్నారు.ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రామాన్ని చేపట్టిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడిందన్నారు. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.మొదటి దశలో దాదాపు రూ.3,497.62 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందన్నారు.గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయి.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపుకు ఉపాధ్యాయులు కృషిచేయాలి.ప్రభుత్వంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్న మన పాఠశాలలు అభివృద్ధికి సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషా శివ, గద్దె బాబు, జడ్పీటిసి పోలీస్ ధర్మారావు, అదనపు కలెక్టర్ శ్రీవాత్స కోట, డీఈఓ డి.వాసంతి, జిల్లా సెక్టరియల్ అధికారి సుదీర్ బాబు,పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ దొంగల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, స్కూల్ చైర్మన్ డి.అశోక్, ప్రత్యేక అధికారి మురళీధర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి శారద, పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ శంకరయ్య,ఎం.ఈ.ఓ.సత్యనారాయణ,ప్రధానోపాధ్యాయులు స్వరూప, బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.