వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓటమి

వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓటమిసిట్జెస్ ( స్పెయిన్ ) : భారత మహిళల చెస్ జట్టు చరిత్ర సృష్టించింది. అంచనాల్లేకుండానే బరిలోకి దిగి అద్భుతం చేసింది. ఫిడే మహిళల ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భారత్ వెండి వెలుగులు పూయించింది. శనివారం రష్యాతో జరిగిన ఫైనల్లో ఓడిపోయిన భారత్, మెగా టోర్నీని ద్వితీయ స్థానంతో ముగించింది.

చెస్ దిగ్గజం, తెలుగు స్టార్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి లేకుండానే బరిలోకి దిగిన భారత్ అంచనాలకు మించి రాణించింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబరిచిన మన అమ్మాయిలు, తుది పోరులో రష్యాకు ధీటైన పోటీనివ్వలేకపోయారు. మొదటి మ్యాచ్ లో 2.5 -1.5 తేడాతో టీం ఇండియాను ఓడించిన రష్యా, అదే జోరులో రెండో మ్యాచ్ లో 3 -1 తో గెలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది.

ఫైనల్ తొలి మ్యాచ్ లో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 47 ఎత్తుల్లో అలెగ్జాండ్రా గోరియచ్కినాపై గెలిచి శుభారంభం చేసింది. కానీ వైశాలి, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడటం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. నాలుగో బోర్డులో అలినాతో గేమ్ ను మేరిఆన్ గోమ్స్ డ్రా చేసుకోవడంతో పాయిండ్ తేడాతో రష్యా గెలిచింది. పసిడి పోరులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన రెండో ఫైనల్లో గొరియచ్కినాతో గేమ్ ను హారిక, కొస్తెనియుక్ గేమ్ ను వైశాలి డ్రా చేసుకుంది.

సెమీస్ లో కీలక విజయంతో జట్టును ఆదుకున్న తానియా సచ్ దేవ్ మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుచలేకపోయింది. భక్తి స్థానంలో పోటీపడిన తానియా, ఓడిపోవడంతో భారత్ ఓటమి ఖరారైంది. చివరి గేమ్ లో మేరీఆన్ పరాజయం ఎదుర్కొనడంతో భారత్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. 2007లో మొదలై రెండేళ్లకొకసారి జరుగుతున్న ఈ మెగాటోర్నీలో భారత జట్టు తొలిసారి పతకం గెలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.