ఎంజీఎంలో ఎలుక బాధితుడు శ్రీనివాస్ మృతి 

ఎంజీఎంలో ఎలుక బాధితుడు శ్రీనివాస్ మృతి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుక దాడి చేసిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం నిన్న సాయంత్రం శ్రీనివాస్ ను వరంగల్ నుండి హైదరాబాద్ కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.

అయితే చికిత్సకు సహకరించక తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఇక ఇప్పుడు తన భర్త మృతితో రోడ్డున పడ్డామని మృతుడి భార్య కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఎంజీఎం వరంగల్ జిల్లాలో పేరెన్నికగన్న ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారింది. అయితే ఇదికాస్త మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఆస్పత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తుంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.

గురువారం అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్ మీద ఎలుకలు రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడిచేసి కాళ్లు, చేతులు, వేళ్ళు కొరికాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుపై బదిలీ వేటు వేసింది. మరో ఇద్దరు వైద్యులపైనా చర్యలు తీసుకుంది.