ఆ 4 మండలాలకు దళిత బంధు నిధులు రిలీజ్

ఆ 4 మండలాలకు దళిత బంధు నిధులు రిలీజ్హైదరాబాద్ : దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 4 జిల్లాలలోని 4 మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. 4 మండలాలకు కలిపి మొత్తం రూ.250 కోట్లు జమ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలోని దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

4 జిల్లాలలోని 4 మండలాలకు కలిపి మొత్తం రూ.250 కోట్లు జమ చేయగా, ఇందులో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100కోట్లు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ.50కోట్లు జమ చేసింది..