అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశారు. టీడీపీ మాచర్ల ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడైన చంద్రయ్యను హత్య చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
ఏపీలో జగన్ సీఎం అయ్యాక ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొదించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. జగన్ పాలనతో ప్రజలను మెప్పించలేక ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.