రెజ్లర్లలను సన్మానించిన కలెక్టర్ రాజీవ్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ పొందుతున్న రెజ్లర్లు భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. స్టేడియంలో శిక్షణ పొందుతున్న కే. అఖిల్ ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈనెల 28 నుండి 30 వరకు పాట్నాలో జరుగనున్న జాతీయస్థాయి జునియర్స్ రెజ్లింగ్ పోటీలకు, వచ్చే ఏప్రిల్ మాసంలో హర్యానాలో జరిగే ”ఖేలో ఇండియా” జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.మరో రెజ్లర్ ఎ.ఉదయ్ హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రెజ్లింగ్ అకాడమీకి ఎంపికయ్యారు. వీరిరువురిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. అంకితభావంతో శ్రమిస్తే రెజ్లింగ్ లో మంచి ఫలితాలు సాధిస్తారని, జాతీయ స్థాయిలో సైతం పతకాలు సాధించి తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తీసుకరావాలన్నారు. ఏడేళ్లుగా వీరికి శిక్షణనిస్తున్న భారత రెజ్లింగ్ కోచ్, జిల్లా క్రీడలు యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మహ్మద్ కరీం, రెజ్లింగ్ కోచ్ కందికొండ రాజులు పాల్గొన్నారు.